Sunday, December 22, 2024
Homeక్రైంపిల్లలతో బలవంతంగా బిక్షాటన చేపిస్తున్న తల్లి

పిల్లలతో బలవంతంగా బిక్షాటన చేపిస్తున్న తల్లి

Date:

కన్న తల్లి తన పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయిస్తున్న ఘటన బయటపడింది. తన పిల్లలు బిక్షాటనతో 45 రోజుల్లోనే 2.5 లక్షలు సంపాదించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్లలు భిక్షమెత్తడం చూడలేక ప్రజలు తమకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు. దీనినే అవకాశంగా తీసుకొని ముఠాలు పిల్లలను యాచనలోకి దింపుతుంటాయి. అలా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకున్న ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కుమార్తె, ఇద్దరు కుమారులతో లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నట్లు తెలిసింది.

ఇండోర్‌ను యాచక రహిత సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులో పని చేస్తున్న ప్రవేశ్‌ అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జీఓ) వీరిని గుర్తించింది. సంస్థ అధ్యక్షురాలు రూపాలీ జైన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారిని చూసిన ఇద్దరు అబ్బాయిలు పారిపోగా ఒక అమ్మాయి దొరికిందని ఆమెను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పజెప్పామన్నారు.

ఆ పిల్లల తల్లి(ఇంద్రాబాయి) ఇండోర్-ఉజ్జయిని రహదారిలోని లువ్-కుశ్‌ కూడలిలో భిక్షాటన చేస్తుండగా పట్టుకున్నామన్నారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఐదుగురు పిల్లలు కాగా ముగ్గురితో ఈ పనిచేయిస్తున్నట్టు తెలిపింది. అలా 45 రోజుల్లో సంపాదించిన రూ. 2.5 లక్షల్లో ఒక లక్షను అత్తామామలకు పంపానని, 50 వేలు బ్యాంకులో జమ చేశానని వెల్లడించింది. రాజస్థాన్‌లో ఆమెకు పెద్ద భవనంతో పాటు వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. మహిళను కోర్టు ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు.