Sunday, December 22, 2024
Homeక్రైంపద్మ భూషణ్ అవార్డును దొంగిలించిన దొంగలు

పద్మ భూషణ్ అవార్డును దొంగిలించిన దొంగలు

Date:

దేశ రాజధాని ఢిల్లీలో దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం చోరీకి గురైంది. ఇందులో మరో విచిత్రం ఏంటంటే.. ఆ పద్మ భూషణ్ పురస్కారం చోరీకి గురైందనే విషయం ఇంటి యజమానికి కూడా తెలియదు. ఆ పద్మ విభూషణ్ అవార్డును దొంగిలించిన దొంగలు.. దాన్ని విక్రయించి డబ్బులు పొందాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు చేసిన పని కారణంగా పోలీసులకు దొరికిపోయారు. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న పంజాబ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మ భూషణ్ పతకం చోరీకి గురైంది. కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ జీసీ ఛటర్జీ మనవడు సమరేశ్ ఛటర్జీకి తెలియకుండా ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడే సమరేశ్ ఛటర్జీ ఒంటరిగా నివసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు వైద్య సహాయం అందించే వ్యక్తి ఈ దొంగతనానికి సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. శ్రావణ్ కుమార్, రింకీ దేవి, హరి సింగ్, వేద్ ప్రకాశ్, ప్రశాంత్‌ బిస్వాస్‌లు నిందితులుగా గుర్తించి వారిని చివరికి పట్టుకున్నారు. వీరంతా మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతానికి చెందినవారని గుర్తించారు.

సమరేశ్ ఛటర్జీకి సహాయకుడిగా ఉన్న శ్రావణ్ కుమార్.. ఆయన తాతకు వచ్చిన పద్మ భూషణ్ గురించి తెలుసుకున్నాడు. దీంతో దాన్ని ఇంట్లో నుంచి దొంగిలించి రింకీ దేవికి అప్పగించాడు. ఆ తర్వాత మిగిలిన నిందితులు అంతా కలిసి ఆ పద్మ భూషణ్ పురస్కారాన్ని చిత్తరంజన్ పార్క్‌ ప్రాంతంలోని జ్యువెలరీ షాప్‌లో విక్రయించాలని నిర్ణయించారు. అయితే ఆ పద్మ భూషణ్ పురస్కారాన్ని కొనుగోలు చేసేందుకు దిలీప్ అనే జ్యువెలర్ నిరాకరించాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఖాలిందికుంజ్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి దిలీప్ విషయాన్ని వివరించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దుకాణం వద్దకు వచ్చి సీసీటీవీ ఫుటేజీ పరీశీలించారు. నిందితులను గుర్తించి వారి కోసం గాలింపు చేపట్టి చివరికి ఐదుగురిని అరెస్ట్ చేశారు.