Sunday, December 22, 2024
Homeక్రైంప‌దేళ్ల‌లో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆర్మీ జ‌వాన్‌

ప‌దేళ్ల‌లో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆర్మీ జ‌వాన్‌

Date:

ఓ ఆర్మీ జ‌వాన్ నిత్య పెళ్లికొడుకులా మారి ప‌లువురు మ‌హిళ‌ల‌ను పెళ్లి చేసుకున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న మనీష్‌ కుమార్‌ గత పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని హైదరాబాద్‌కు చెందిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హరియాణాకు చెందిన మనీష్‌ కుమార్‌ 2015లో హైదరాబాద్‌లో తనకు పరిచయం అయ్యారని.. తర్వాత తాము వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపింది. మొదట్లో బాగానే ఉన్నా.. కొన్ని రోజుల తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను తరచూ వేధింపులకు గురిచేసేవాడని బాధిత మహిళ తెలిపింది. 2018లో తాను గర్భం దాల్చినప్పుడు అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడని, అతడి మాట వినపోవడంతో తనను విడిచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

మనీష్‌ ఆచూకీ కోసం వెతకగా.. అప్పటికే అతడికి మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం తనకు తెలిసిందని ఆమె పోలీసులకు వెల్లడించింది. ఆ తర్వాత తాను మారినట్లు చెప్పి కొంత కాలం పాటు తన దగ్గరే ఉన్నాడని.. తనకు కుమారుడు పుట్టిన అనంతరం మరోసారి అదృశ్యమయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ మేరఠ్‌లోని ఓ కాలనీలో ఇద్దరు మహిళలతో అతడు దొరికినట్లు చెప్పింది. ఈ ఘటనపై మొదట కంకరఖేడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని, అందుకే జిల్లా ఎస్‌ఎస్‌పీ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.