ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. సూడోపెడ్రిన్‌కు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మెథాంఫేటమిన్ తయారీలో దీన్ని వినియోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కిలో రూ. 1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్ పంపుతున్నట్లు ఎన్‌సీబీ సమాచారం అందుకుంది. దీనిని హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ డ్రగ్ మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది.
ఈ క్రమంలోనే సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 15న పశ్చిమ దిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో తనిఖీ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ భారత్ సహా మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ఇప్పటి వరకు 3,500 కిలోల సూడోఫెడ్రిన్‌తో ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేశారని.. దీని విలువ రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతడి ఫొటోను విడుదల చేస్తామని పోలీస్ అధికారులు చెప్పారు.