వెంబకొట్టాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో మహిళలు ఉన్నారు. తమిళనాడు విరుద్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో రోజులానే శనివారం ఉదయం కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా.. కెమికల్ మిక్సింగ్ రూములో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద స్థలిలోనే ఏడుగురు మరణించగా.., ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు మృత్యువాత పడినట్లు పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని శివకాశి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.