ఒక వ్యక్తి డ్రగ్స్, మద్యానికి బానిసైన వ్యక్తి ఉన్మాదిలా మారాడు. తల్లిని కాల్చి చంపి, భార్యను సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. మేడ పైనుంచి ముగ్గురు పిల్లలను కిందకు విసిరేసి చంపాడు. ఆ తర్వాత గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. పల్హాపూర్ గ్రామానికి చెందిన 42 ఏళ్ల అనురాగ్ సింగ్, మాదకద్రవ్యాలు, మద్యానికి బానిస అయ్యాడు. మానసిక వికలాంగుడైన అతడు తరచుగా కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. దీంతో అతడిని డీ అడిక్షన్ సెంటర్‌కు పంపాలని కుటుంబ సభ్యులు భావించారు.
శనివారం మద్యం సేవించిన అనురాగ్ సింగ్ మళ్లీ కుటుంబంతో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో డీ అడిక్షన్ సెంటర్‌లో చేరాలని కుటుంబ సభ్యులు కోరారు. దీంతో ఉన్మాదిలా మారిన అతడు ఇంట్లో విధ్వంసం సృష్టించాడు. తొలుత గదిలో ఉన్న 65 ఏళ్ల తల్లి సావిత్రిని గన్‌తో కాల్చి చంపాడు. తర్వాత 40 ఏళ్ల భార్య ప్రియాంక తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. అనంతరం ముగ్గురు పిల్లలైన 12 ఏళ్ల అశ్విని, 9 ఏళ్ల ఆర్నా, 6 ఏళ్ల అద్విక్‌ను మేడ పైనుంచి కిందకు విసిరేయడంతో వారు చనిపోయారు. ఆ తర్వాత అనురాగ్ సింగ్ గన్‌తో కాల్చుకోవడంతో అతడు కూడా మరణించాడు.