Sunday, October 6, 2024
Homeక్రైండ్రగ్స్ కేసులో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు

డ్రగ్స్ కేసులో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు

Date:

మణికొండలోని కేవ్‌ పబ్‌లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డీజే నిర్వాహకుడు ఆయూబ్‌తో పాటు మరో 24 మంది డ్రగ్స్‌, గంజాయి తీసుకున్నట్టు తేలిందన్నారు. మత్తు పదార్థాలు తీసుకున్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. కేవ్‌ పబ్‌లో టీజీ న్యాబ్‌ అధికారులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు నిర్వహించి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను మాదాపూర్‌ డీసీపీ వినిత్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. 

”పబ్‌లో ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ పార్టీ ఏర్పాటు చేసి డ్రగ్స్‌ సేకరించినట్టు గుర్తించాం. 25 మంది పైనా ఎన్‌డీపీఎస్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. బయట డ్రగ్స్‌ తీసుకొనే పబ్‌లోకి వచ్చారని విచారణలో తేలింది. సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ పార్టీ ఏర్పాటు చేశామని ప్రచారం చేశారు. పక్కా సమాచారం రావడంతో తెలంగాణ నార్కోటిక్‌, సైబరాబాద్‌, ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులు సోదాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలను ప్రోత్సహించినందుకు కేవ్‌ పబ్‌ను సీజ్‌ చేశాం. ఈ కేసులో పబ్‌ మేనేజర్‌ శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఐటీ సంస్థలు వారి సిబ్బందికి డ్రగ్స్‌ తీసుకోవద్దని అవగాహన కల్పించాలి. త్వరలో మిగిలిన పబ్‌లలో కూడా సోదాలు చేస్తాం. గతంలో కూడా ఈ పబ్‌లో ఇలాంటి తరహా పార్టీలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయి. పబ్‌ యజమానులు నలుగురు పరారీలో ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం వస్తుంది” అని డీసీపీ తెలిపారు.