జొమాటో బాయ్ ముసుగులో డ్రగ్స్ డెలివరీ చేస్తున్న యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పవన్ కుమార్ (31), ఆదర్శ్ కుమార్ సింగ్ (33)గా గుర్తించారు. 874 గ్రాముల గంజాయి, 21.7 గ్రాముల ఎండీఎం మత్తు పదార్థాలతో పాటు మూడు సెల్ ఫోన్లు,రెండు డిజిటల్ వేయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద దొరికిన మాదకద్రవ్యాల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.8 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. బెంగుళూరు నుంచి ఎండిఎంఏ, ఆంధ్రాఒడిశా సరిహద్దు నుంచి తెచ్చిన గాంజాను నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కిలో గంజా వెయ్యి రూపాయలకు, ఎండీఏంను 3 వేలకు కొని.. హైదరాబాద్‌లో ఏడువేలు, పది వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. యువత టార్గెట్‌గా వీటిని అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద కాలేజీల్లో విద్యార్థులకు వీటిని అమ్ముతూ.. అక్రమ మార్గాల్లో డబ్బును సంపాదిస్తున్నట్లు వెల్లడించారు.
డ్రగ్స్‌కు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని మాదాపూర్ పోలీసులు సూచించారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన వారు తమను సంప్రదిస్తే డ్రగ్ అడిక్షన్ సెంటర్ పంపిస్తామని చెప్పారు. ఇటీవల రాయదుర్గంలో కూడా ఓ జొమాటో డెలివరీ బాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి.. సిటీలో విక్రయిస్తున్న నవీన్ అనే యువడిని అరెస్ట్ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నగరంలో తనిఖీలను ముమ్మరం చేశారు.