Monday, December 23, 2024
Homeక్రైంజైల్లో బ్యాంక్ మేనేజర్.. ఖైదీ స్నేహితులయ్యారు

జైల్లో బ్యాంక్ మేనేజర్.. ఖైదీ స్నేహితులయ్యారు

Date:

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయం సమాచారం మేరకు.. దాడులు నిర్వహించిన పోలీసులు.. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను అరెస్టు చేశారు. చంద్రయ్య దగ్గరి నుంచి రూ.45 వేల విలువైన 500 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో.. మల్లంపేట బాచుపల్లిలోని మరో నిందితుడు జగదీశ్‌ని అదుపులోకి తీసుకుని.. అతని నివాసంలో ఏకంగా ఏడున్న లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్, సీపీయూ, ప్రింటర్‌తో పాటు 5 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

జగదీశ్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు అతని బ్యాక్ గ్రౌండ్ తెలిసి అవాక్కయ్యారు. జగదీశ్ గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌గా పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ స్థాయిలో పని చేసిన వ్యక్తి ఇలాంటి వ్యవహారంలో పట్టుపడటం చూసి షాకయ్యారు. అయితే.. దీంతో విచారణ ముమ్మరం చేశారు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు జగదీష్.. బ్యాంకులో ఉద్యోగం చేసే సమయంలోనూ నిధులు దుర్వినియోగం చేశాడు. దానికి సంబంధించిన కేసులో అరెస్టయి.. నెల రోజులపాటు సంగారెడ్డి జిల్లా కంది జైలులో శిక్ష అనుభవించినట్టు గుర్తించారు.

జైలులో ఉన్న సమయంలోనే.. జగదీష్‌కు మరో నిందితుడు వీర వెంకటరమణ పరిచయం అయ్యాడు. అప్పటికే వీర వెంకటరమణ కోనసీమ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తూ దొరికిపోయి.. శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. జైలు నుంచి విడుదలయ్యాక నిందితులు ఇద్దరూ నకిలీ నోట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే జైలు నుంచి వచ్చాక.. మరో వ్యక్తి శివకుమార్‌ను కూడా గ్యాంగ్‌లో కలుపుకున్నారు. ముద్రణకు సంబంధించిన యంత్రాలు కొనుగోలు చేసి నకిలీ నోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. వాటిని చలామణి చేస్తూ.. తాజాగా తాండూర్ పోలీసులకు చిక్కారు. దీంతో నలుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.