Sunday, December 22, 2024
Homeక్రైంజగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు

జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు

Date:

గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే జగజ్యోతి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అరెస్ట్​ చేశారు. ఆమె ఇంట్లో సుమారు రూ.64 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు కిలోల బంగారం కూడా తనిఖీల్లో పట్టుబడినట్లు పేర్కొన్నారు. జగజ్యోతిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో తనకు ఛాతిలో నొప్పి వస్తుందంటూ జ్యోతి చెప్పడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

జ్యోతి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా కేసును విచారించనుంది. అంతకుముందు జరిగిన పరిణామాల వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్​ జిల్లాలోని అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహనిర్మాణ పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్​ బోడుకం గంగాధర్​ వద్ద గిరిజన సంక్షేమశాఖ ఈఈ జగజ్యోతి డబ్బులు డిమాండ్​ చేసింది. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై అధికారులు స్పందించి ఆమెను పట్టుకునేందుకు పథకం వేశారు. దీని ప్రకారమే సోమవారం రోజున కార్యాలయానికి వెళ్లిన గంగాధర్​ రూ.84 వేలు లంచం ఇచ్చాడు. ఆ సమయంలోనే అధికారులు జ్యోతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.