ఓ జంటకు ఇటీవలే బిడ్డ జన్మించింది. దాంతో కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగా పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలని భార్యకు సూచించాడు. ఆరోగ్యానికి మేలు చేసేది ఏది అడిగినా తెచ్చి ఇచ్చాడు. ఈ క్రమంలో భార్య తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని ఉందని చెప్పింది. బాలింతరాలు కావడంతో జంక్ ఫుడ్ వద్దని భర్త అభ్యంతరం చెప్పాడు. దాంతో ఆగ్రహానికి లోనైన భార్య నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై గృహ హింస కేసు పెట్టింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.
తన భర్త తనను ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడంలేదని, ఇది గృహహింస కిందికే వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు భర్తను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విషయం తెలుసుకుని ఇద్దరికీ రాజీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా భార్య వినిపించుకోలేదు. దాంతో ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఈ వింత కేసును విచారించిన జడ్జి.. జరిగిన సంగతి తెలుసుకుని భార్యను మందలించారు. భార్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని చీవాట్లు పెట్టాడు. ఆమె భర్తపై పోలీసులు నమోదు చేసిన కేసుపై స్టే విధించారు. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లేందుకు అనుమతించారు.