థానే బద్లాపూర్ పాఠశాలలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారులపై ఒక్కసారి కాకుండా నిందితుడు గత పదిహేను రోజులుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిటీ పేర్కొంది. ఘటనపై పాఠశాల యాజమాన్యం తీవ్ర జాప్యం చేసిందని ఎత్తి చూపింది. నిందితుడు అక్షయ్ శిందే నేపథ్యం గురించి ఎలాంటి తనిఖీలు చేయకుండానే ఆగస్టు 1న అతడిని కాంట్రాక్ట్ వర్కర్‌గా నియమించుకున్నారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పాఠశాలకు సంబంధించిన ఐడీ కూడా అతడి వద్ద లేదని తెలిపింది. స్కూల్‌లో వాష్‌రూమ్ స్టాఫ్ రూమ్‌కు దూరంగా ఉందని, పిల్లల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని వెల్లడించింది.
బద్లాపుర్‌లోని పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్ ఉన్న సమయంలో.. దానిని శుభ్రం చేసే వంకతో ఒక స్వీపర్ వారివద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్‌లపై ఆందోళనకారుల నిరసనతో రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేగాకుండా ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది. ఆ పిల్లల క్లాస్ టీచర్, వారి బాధ్యతలు చూస్తున్న ఇద్దరు సిబ్బందిని తొలగించింది.