Thursday, October 3, 2024
Homeక్రైంకోటి ఖర్చు చేసి మామను చంపించిన మహిళ

కోటి ఖర్చు చేసి మామను చంపించిన మహిళ

Date:

ఒక మహిళ సుమారు రూ.300 కోట్ల ఆస్తిని దక్కించుకునేందుకు కోటి ఖర్చు చేసి మామను చంపించింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. మే నెలలో 82 ఏళ్ల పురుషోత్తం పుట్టేవార్‌ భార్యకు సర్జరీ జరిగింది. కోలుకుంటున్న ఆమెను చూసేందుకు పురుషోత్తం ఆసుప్రతికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా ఒక కారు వేగంగా ఆ వృద్ధుడ్ని ఢీకొట్టి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు మరణించాడు.

ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరిపారు. వృద్ధుడు పురుషోత్తంను ఢీకొట్టిన కారు డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఆ నిందితుడు వృద్ధుడి కుమారుడి కారు డ్రైవర్‌గా పోలీసులు తెలుసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా వృద్ధుడి కోడలైన 53 ఏళ్ల అర్చనా మనీష్ పుట్టేవార్ ఆస్తి కోసం మామను హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీని కోసం ఆమె కోటి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. మరోవైపు డాక్టరైన భర్త మనీష్‌ కారు డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌లతో కలిసి మామ పరుషోత్తం హత్యకు కోడలు అర్చన కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలింది. రోడ్డు ప్రమాదంలో మామ మరణించినట్లుగా నమ్మించేందుకు సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేయించింది. మామను చంపేందుకు నిందితులకు ఆమె కోటి చెల్లించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌ అయిన అర్చనతోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. రెండు కార్లు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.