Thursday, December 26, 2024
Homeక్రైంకేకలు వినిపించకుండా పెదవులను అతికించి.. నెల రోజులుగా లైంగిక వేధింపులు

కేకలు వినిపించకుండా పెదవులను అతికించి.. నెల రోజులుగా లైంగిక వేధింపులు

Date:

పొరుగింటి వ్యక్తి ఒక యువతిని నెల రోజుల పాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు ఎవరికీ వినిపించకుండా పెదవులను అంటించడమే కాకుండా.. గాయాలపై కారం చల్లి, హింసించాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

గుణ ప్రాంతంలో బాధితురాలు తన తల్లితో కలిసి నివసిస్తోంది. నెల రోజుల క్రితం నిందితుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి తన ఇంట్లో బంధించాడు. దాంతో ఆమె తప్పించుకోవడానికి వీలులేకుండా పోయింది. తనను పెళ్లి చేసుకోవాలని, తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని అప్పగించాలని వేధించినట్లు సదరు యువతి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే లైంగికంగా వేధించి, బెల్ట్‌, వాటర్‌ పైపులతో కొట్టేవాడని తెలిపింది. అయితే మంగళవారం రాత్రి ఆమె తప్పించుకోవడానికి అవకాశం దొరకడంతో.. అక్కడినుంచి బయటపడి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. పెదవులు అంటించి ఉండటం, కళ్లు వాచి పోయి, ఒళ్లంతా గాయాలతో ఉన్న ఆమెను చూసి పోలీసులు చలించిపోయారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఈ ఘటన సమయంలో ఆమె తల్లి వేరే ఊరిలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.