Sunday, October 6, 2024
Homeక్రైంకాలేజీ ఫీజు డబ్బులతో బీటెక్‌ విద్యార్థి బెట్టింగ్

కాలేజీ ఫీజు డబ్బులతో బీటెక్‌ విద్యార్థి బెట్టింగ్

Date:

ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. కాలేజీ ఫీజు డబ్బులను బెట్టింగ్‌లో పోగొట్టడంతో తల్లిదండ్రుల మందలించారని బీటెక్‌ విద్యార్థి గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. నల్గొండలోని రవీంద్రనగర్‌కు చెందిన కొండూరు శ్రీనివాస్, నాగలక్ష్మి దంపతులకు నితిన్‌(21), ఇద్దరు కుమార్తెలు సంతానం. ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి కళాశాలలో బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న నితిన్‌.. స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు.

నితిన్‌ చదివే కళాశాలలో ఫీజు చెల్లించాల్సి ఉండగా 10 రోజులు క్రితం తల్లిదండ్రులు రూ.1.03 లక్షలు నగదును కుమారుడుకి ఇచ్చారు. కళాశాలలో ఫీజు చెల్లించకుండా ఆ డబ్బులు బెట్టింగ్‌లో పోగొట్టాడు. ఈ విషయం తెలుసుకొని… కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇలా ఎందుకు చేశావని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన నితిన్‌.. మంగళవారం సాయంత్రం ఘట్‌కేసర్‌- చర్లపల్లి మధ్య గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకోపైలెట్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీమార్చురీకి తరలించారు. మృతుడి వద్ద లభ్యమైన సెల్‌ఫోన్‌ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.