Thursday, September 19, 2024
Homeక్రైంకలకత్తా నిందితుడికి లై-డిటెక్టర్‌ టెస్ట్‌

కలకత్తా నిందితుడికి లై-డిటెక్టర్‌ టెస్ట్‌

Date:

పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో నిందితుడికి సంజయ్‌ రాయ్‌కు పాలిగ్రాఫ్‌/లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ వర్గాలు సోమవారం వెల్లడించాయి. మంగళవారం అతడికి ఈ పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన ఈ దారుణం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్‌ వైద్యురాలు ఆగస్టు 8వ తేదీ రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఈ అఘాయిత్యం జరిగింది. ఈ ఘటనలో సివిక్‌ వాలంటరీ సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. లేదా నిందితుడి వెనుక ఎవరైనా ఉండి ఉంటారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే నిజానిజాలు తెలుసుకునేందుకు సంజయ్‌ రాయ్‌కు పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించేందుకు అనుమతినివ్వాలని న్యాయస్థానానికి సీబీఐ కోరింది. తాజాగా అందుకు అంగీకరించిన కోర్టు.. కేసు తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.