Tuesday, October 1, 2024
Homeక్రైంఒక వ్యక్తి 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించాడు

ఒక వ్యక్తి 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించాడు

Date:

ఒక వ్య‌క్తి 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించి విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు దొంగ‌త‌నం చేశాడు. ఏప్రిల్ 11వ తేదీన రూ. 7 ల‌క్ష‌ల విలువ చేసే ఆభ‌ర‌ణాలు విమానంలో మాయమైన‌ట్లు ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధిత మ‌హిళ‌ హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి ప్ర‌యాణించారు. ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన మ‌రో ప్యాసింజ‌ర్ నుంచి రూ. 20 ల‌క్ష‌ల విలువ చేసే ఆభ‌ర‌ణాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను దొంగిలించారు. ఇత‌ను అమృత్‌స‌ర్ నుంచి ఢిల్లీకి ప్ర‌యాణించాడు. బాధిత ప్ర‌యాణికుడు కూడా పోలీసుల‌కు పిర్యాదు చేశాడు. ఇత‌ర విమానాశ్ర‌యాల్లోనూ దొంగ‌త‌నం కేసులు న‌మోదు అయ్యాయి.

ఈ క్ర‌మంలో పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఢిల్లీ, అమృత్‌స‌ర్, హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించారు. ఢిల్లీ – అమృత్‌స‌ర్, హైద‌రాబాద్ – ఢిల్లీ విమానాల్లో ప్ర‌యాణించిన వారిని ప‌రిశీలించ‌గా, ఒక వ్య‌క్తి రెండు విమానాల్లో ప్ర‌యాణిస్తూ అనుమానాస్ప‌దంగా క‌నిపించాడు. దీంతో ఆ అనుమానాస్ప‌ద వ్య‌క్తి ఫోన్ నంబ‌ర్‌ను పోలీసులు చేధించారు. అనంత‌రం అత‌న్ని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.

విమానాల్లో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న వ్య‌క్తిని రాజేశ్ కపూర్‌(40)గా పోలీసులు గుర్తించారు. అయితే ఎయిర్‌పోర్టుల్లో తిరుగుతూ వృద్ధుల‌ను టార్గెట్ చేసేవాడు. ఇక వారిని అనుస‌రిస్తూ ఎంట్రీ పాయింట్ వ‌ద్ద వారితో మాట క‌లిపేవాడు. వారు తీసుకెళ్తున్న ల‌గేజీలో ఏయే వ‌స్తువులు ఉన్నాయో క‌నుగొనేవాడు. దాంతో వారితో పాటు విమానం ఎక్కేవాడు. ఇక విమానంలో వారి సీటు ప‌క్క‌నే కూర్చొనేందుకు సిబ్బందితో మాట్లాడి ఒప్పించేవాడు. ఆ త‌ర్వాత మెల్ల‌గా వారి బ్యాగుల్లోని విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌దును కొట్టేసేవాడు. ఢిల్లీ ప‌హార్‌గంజ్‌లో రిక్కీ డీల‌క్స్ పేరిట రాజేశ్‌కు సొంత గెస్ట్ హౌజ్ ఉంది. దాంట్లోనే అత‌డు మూడో అంత‌స్తులో నివాస‌ముండేవాడు. ఒక‌ప్పుడు మ‌నీ ఎక్స్ఛేంజ్ బిజినెస్‌తో పాటు మొబైల్ రిపేర్ షాపును న‌డిపేవాడు. ఆ ఇంట్లోనే పోలీసులు పెద్ద ఎత్తున బంగారం, వెండి న‌గ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వ‌స్తువుల‌ను ప‌క్క వీధిలో ఉండే న‌గ‌ల వ్యాపారికి విక్ర‌యించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.