Saturday, October 5, 2024
Homeక్రైంఏఐ వాయిస్ ఉపయోగించి మహిళ మోసం

ఏఐ వాయిస్ ఉపయోగించి మహిళ మోసం

Date:

రోజురోజుకు టెక్నాలజీలో కొత్త, కొత్త మార్పులు వస్తున్నాయి. దానికి తోడు కృత్రిమ మేధస్సు నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్నిరంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే.. ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలకు తెర లేపుతున్నారు. తాజాగా ఓ మహిళ ఏఐ ద్వారా పురుషుడిలా వాయిస్‌ మార్చి మరో యువతిపై బెదిరింపులకు దిగింది. ఆమె నుంచి రూ.6 లక్షలకు పైగా కాజేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాకు చెందిన ఓ మహిళ ఏఐను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడింది. పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడింది. ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలోనే బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్‌ చేసింది. అలా రూ.6 లక్షలకు పైగా దోపిడీ చేసింది. వేధింపులు తాళలేని బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఏఐ సాంకేతికతతో ఇదంతా చేసింది పొరుగింటి మహిళ అని తెలిసి అంతా షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి శనివారం ఆ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.