తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ సెక్యూరిటీ విభాగం అడిషనల్ డీసీపీ తిరుపతన్న అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వెల్లడించిన వివరాల ఆధారంగా ఆ పోలీస్ ఉన్నతాధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఉదయం భుజంగరావు, తిరుపతన్నను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వీరిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏప్రిల్ 6 వరకు వీరికి రిమాండ్ విధించగా.. అనంతరం పోలీసులను వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఏప్రిల్ 6 వరకు నిందితులకు రిమాండ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించారు. కొంపల్లి మెజిస్ట్రేట్ నివాసం వద్ద నిందితుల తరఫు అడ్వకేట్ రాజేందర్ మాట్లాడుతూ.. భుజంగరావు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు రెండు వారాల పాటు రిమాండ్ విధించినట్లు తెలిపారు. రిమాండ్ వ్యతిరేకించడంతో పాటు బెయిల్ ఇవ్వాలని మేజిస్ట్రేట్ ను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తమ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. దాంతో తాము తిరిగి మంగళవారం బెయిల్ ప్రొసీడింగ్స్ మొదలుపెడతామని అడ్వకేట్ రాజేందర్ వెల్లడించారు. రిమాండ్ లో భాగంగా నిందితులు ముగ్గుర్ని కొంపల్లి మేజిస్ట్రేట్ నివాసం నుంచి పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు, తిరుపతన్నలపై ఐపీసీ సెక్షన్ 120a, 409, 427, 201, 34 of sec 3 public property damage కింద కేసులు నమోదు చేశారు.