Sunday, December 22, 2024
Homeక్రైంఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై అప్పులపాలు

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై అప్పులపాలు

Date:

చేతిలో మొబైల్ ఉంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారో, ఏలాంటి వాటికి బానిస అవుతున్నారో తెలియదు. అలాంటిది ఒక వ్యక్తి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై స్నేహితుల దగ్గర అప్పులు చేసాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడంతో బంధువైన మహిళకు చెందిన నగలు చోరీ చేశాడు. వాటిని అమ్మి ఆ డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద ఇన్సురెన్స్‌ పాలసీలు కొన్నాడు. బీమా డబ్బుతో అప్పులు తీర్చేందుకు తల్లిని హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హిమాన్షు అనే వ్యక్తి జూపీ అనే యాప్‌లో ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. పదేపదే నష్టపోవడంతో అప్పులు చేశాడు. వాటిని చెల్లించేందుకు స్నేహితుల నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు.

డబ్బు తిరిగి ఇవ్వాలని హిమాన్షుకు స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో గత ఏడాది డిసెంబర్‌లో మేనత్త నగలు చోరీ చేశాడు. ఆ డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద రూ.50 లక్షల చొప్పన ఇన్సూరెన్స్‌ పాలసీలు కొన్నాడు. బీమా డబ్బుతో అప్పులు తీర్చాలని భావించాడు. తండ్రి రోషన్ సింగ్ ఇటీవల చిత్రకూట్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా 50 ఏళ్ల తల్లి ప్రతిభను కుమారుడు హిమాన్షు హత్య చేశాడు. శవాన్ని మూటకట్టి ట్రాక్టర్‌లో తీసుకెళ్లాడు. తల్లి మృతదేహాన్ని యమునా నదిలో పడేశాడు.

మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన రోషన్‌ సింగ్‌, తన భార్య, కుమారుడు కనిపించకపోవడంతో స్థానికులు, బంధువులను ఆరా తీశాడు. హిమాన్షు ట్రాక్టర్‌తో నది తీరంలో కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 21న పోలీసులను అలెర్ట్‌ చేయడంతో అతడ్ని అరెస్ట్‌ చేశారు. హిమాన్షును ప్రశ్నించగా తల్లిని హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.