బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చివేస్తామని శనివారం నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ‘అల్-ఖైదా’ పేరుతో అధికారులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేయగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీనిపై కేసు నమోదు చేసుకొని మెయిల్ పంపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టగా అనుమానితుడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిని బిహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన మొహమ్మద్ జాహిద్(51)గా గుర్తించారు. కోల్‌కతాలో పాన్‌షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడన్నారు. కాగా అతడు బెదిరింపు మెయిల్ ఎందుకు పంపాడనే విషయం ఇంకా తెలియరాలేదని, దీనిపై విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
గత కొద్దికాలంగా దేశంలో బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. జూన్ 18న పట్నా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రాగా విచారణ అనంతరం అది బూటకపు మెయిల్ అని తేలింది. కాగా మెయిల్ ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా ఓ ఇంట్లో భారీ మొత్తంలో బాంబు తయారీ సామగ్రి లభ్యమైంది. ఈ కేసులో పవన్ మహ్తో అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా తాజాగా బిహార్ సీఎంఓకు బాంబు బెదిరింపు కాల్‌పై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.