ఒక సీనియర్ పోలీసు కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇక్కడికి తినడానికి రాలేదు.. విధి నిర్వహణకు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ కానిస్టేబుల్‌ను ఐపీఎస్ ఆఫీసర్ హెచ్చరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అజంఘర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అజంఘర్ పోలీసులు బందోబస్తు కల్పించారు. అయితే కార్యక్రమం వద్ద భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక విధుల్లో ఉన్న ఓ సీనియర్ పోలీసు కానిస్టేబుల్ ప్లేటులో ఆహారం వడ్డించుకుని తినేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్.. అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇక్కడికి విధులకు వచ్చామని, భోజనం చేయడానికి కాదని మందలించారు.
దీంతో తీవ్ర అవమానానికి గురైన ఆ కానిస్టేబుల్.. ఆహారంతో ఉన్న ప్లేటును డస్ట్ బిన్‌లో పడేసి వెళ్లిపోయారు. సీఎం ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత భోజనం చేయాలని ఆదేశించారు. ఐపీఎస్ ఆఫీసర్‌ను శుభం అగర్వాల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.