ఒక మహిళ తన సమస్య గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. మహిళ సమస్య విన్నాక ఆమె నంబర్ తీసుకున్న.. అక్కడి ఇన్‌స్పెక్టర్ ఆమెకు అసభ్య మెసేజ్‌లు చేశాడు. దీంతో బాధితురాలు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో సదరు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు.
సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పురేందర్ రెడ్డి… ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మహిళతో ఇన్‌స్పెక్టర్ అసభ్య చాటింగ్ చేశాడు. బాధితురాలు ఇది తప్పని వారించి.. సీఐ బాగోతాన్ని సిటీ కమిషనర్‌కు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేసుకు రా అంటూ అతడు పెట్టిన అసభ్య మెసెజ్‌ల తాలూకా ఆధారాలను కూడా అందజేసింది.
సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ప్రవర్తనపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది.. స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా మెలగాలని.. తప్పుగా వ్యవహరిస్తే.. వేటు పడుతుందని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. పోలీస్ శాఖకు గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించినా.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.