Friday, January 3, 2025
Homeక్రైంమోమోస్ తిని మ‌హిళ మృతి

మోమోస్ తిని మ‌హిళ మృతి

Date:

హైద‌రాబాద్ బంజారాహిల్స్ ప‌రిధిలో మోమోస్‌ తిని ఓ మహిళ మృతిచెందగా.. సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

బాధితుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్‌ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు. వీరందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో బంజారాహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మోమోస్‌ తిన్నవారిలో దాదాపు 10 మంది మైనర్లు ఉన్నారు. రేష్మ బేగం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమె మృతిచెందారు. ఈ సంఘటనపై ఇప్పటికే బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. మోమోస్‌తో పాటు ఇచ్చే మయోనైజ్‌, మిర్చి చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.