Thursday, December 26, 2024
Homeక్రైంప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు వెళ్లిన క‌లెక్ట‌ర్‌పై దాడి

ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు వెళ్లిన క‌లెక్ట‌ర్‌పై దాడి

Date:

వికారాబాద్ జిల్లా దుద్యాల‌లో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్, అధికారులకు బాధిత రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. కలెక్టర్‌, అధికారుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో దుద్యాల శివారులో నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, కొడంగల్‌ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ లింగానాయక్‌, సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ వచ్చారు. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తే.. రైతులు మాత్రం అక్కడికి వెళ్లకుండా లగచర్లలోనే ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సురేశ్‌ అనే వ్యక్తి బాధిత రైతుల తరఫున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వెళ్లి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరిలో ఉన్నారని.. అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో కలెక్టర్‌, ఇతర అధికారులు అంగీకరించి అక్కడికి బయల్దేరి వెళ్లారు. అధికారులు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి. ఆయన పొలాల వెంబడి పరుగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్‌, అధికారులు లగచర్ల వెళ్లే సమయంలో ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.