ఏపీలో మద్యం షాపులను దక్కించుకునేందుకు స్థానికులే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, అమెరికా, యూరోప్ నుంచి కూడా పలువురు పోటీ పడ్డారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపారు. విశాఖపట్నంలో ఓ వ్యక్తి ఏకంగా 155 లిక్కర్ షాపులకి దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం ఏకంగా రూ.3.10 కోట్లు రుసుము చెల్లించాడు. ఇదే చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు అంతకు మించిన మరో వార్త బయటకి వచ్చింది.
మద్యం లాటరీ పూర్తి అయిన తర్వాత.. వ్యక్తి ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తన స్నేహితులతో కలిసి మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఏకంగా రూ.7.16 కోట్లు దరఖాస్తు రుసుం చెల్లించామని పేర్కొన్నారు. ఎన్ని లైసెన్సులు వచ్చాయనేదీ పక్కనబెడితే.. మొత్తం 358 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసినట్లు తెలిపాడు. ఇక దీని కోసం దరఖాస్తు రుసుము కింద రూ.7.16. కోట్లు చెల్లించామని చెప్పాడు. అయితే లాటరీలో 10 మద్యం దుకాణాలు మాత్రమే వచ్చాయన్నాడు.
ఇక తనకు డబ్బులు పోయినందుకు బాధ లేదని.. రాష్ట్రాభివృద్ధి కోసం మనం ఏడు కోట్లు విరాళం ఇచ్చామని గర్వంగా ఫీలవ్వమని చెప్పానంటూ ట్వీట్ చేశాడు. ఇక 358 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేస్తే విజయవాడ సిటీలో నాలుగు, గుంటూరు సిటీ, గ్రామీణ ప్రాంతంలో మరొకటి, పల్నాడులో ఒకటి, చీరాలలో ఒకటి వచ్చిందని తెలిపాడు. మరోవైపు ఈ ట్వీట్ కి నెటిజన్లు రిప్లైలు ఇస్తున్నారు.