సామాజిక మాధ్యమాల్లో పైశాచికలు పెరిగిపోయాయని, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి తల్లి, చెల్లిపైన వారి పార్టీ నాయకులే అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు. ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు.. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసి అక్రమ కేసులకు గురికావడం తనను బాధించిందన్నారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారు.. చేయని తప్పునకు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎక్కడా నిరాశకు గురికాలేదు, ధైర్యం కోల్పోలేదన్నారు. 53 రోజుల జైలు జీవితం.. మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలను ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి…
”సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. వ్యక్తిత్వ హననం జరుగుతోంది. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. మమ్మల్ని మాత్రమే కాదు.. సొంత తల్లి, చెల్లిని కూడా బూతులు తిట్టిస్తున్న వాళ్లని ఏం చేయాలి? ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదు అంటే ఎలా? సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారిని ఎలా నియంత్రించాలనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగాలి. సామాజిక మాధ్యమాల్లో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.