కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లిన విఘ్నేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనపై బద్వేలు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో 8వ తరగతి నుంచే విఘ్నేశ్ .. తమకు కుమార్తెను వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అతనికి వివాహమైనా వేధింపులు ఆపలేదని, ఇవాళ పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
గాయపడిన ఇంటర్ విద్యార్థినికి కడప రిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. 80శాతం గాయాలయ్యాయి. చిన్నప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. ఇద్దరూ బద్వేలు రామాంజనేయనగర్‌కు చెందినవారే. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేశ్ ఫోన్ చేశాడు. కలవకపోతే చనిపోతానని ఆమెను బెదిరించాడు. ఇద్దరూ పీపీకుంట చెక్‌పోస్టు సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారు. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విఘ్నేశ్ పరారయ్యాడు. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు బృందాలతో గాలింపు చేపట్టాం” అని కడప ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు.
నిందితుడిని అరెస్టు చేయండి: చంద్రబాబు
ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.