Wednesday, January 15, 2025
HomeUncategorizedగోదావ‌రిలో మ‌ళ్లీ పెరుగుతున్న వ‌ర‌ద

గోదావ‌రిలో మ‌ళ్లీ పెరుగుతున్న వ‌ర‌ద

Date:

ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరదనీరు రాజమహేంద్రవరం వైపుగా ప్రవహిస్తోంది.
గోదావరిలో వరద మళ్లీ క్రమంగా పెరుగుతోంది. నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన ప్రవాహం.. శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.75 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 13లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు, కల్వర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాచలం వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని లంక గ్రామాలను వరదనీరు చుట్టు ముట్టేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వరదనీరు వదులు తుండడంతో కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రవహించే గౌతమీ గోదావరి బాలయోగి వారధి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజీవ్ బీచ్ పరివాహక ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి పర్యాటక శాఖకు చెందిన వాటర్ స్పోర్ట్స్ నీట మునిగింది. మత్స్యకారులు తమ మెకనైజ్డ్ బోట్లు, నావలు, వలలు కొట్టుకుపోకుండా టైడల్ లాక్ వద్దకు చేర్చి తాళ్లతో బంధించారు.