Sunday, September 22, 2024
HomeUncategorizedరైలు కోసం టికెట్ కొంటారు కానీ రైల్ ఎక్కరు

రైలు కోసం టికెట్ కొంటారు కానీ రైల్ ఎక్కరు

Date:

నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండలో మాత్రమే రైల్వే స్టేషన్ ఉంది. ఈ నియోజకవర్గం ప్రజలు ప్రయాణం చేయాలంటే ఈ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే ప్రయాణం చేయాలి. అయితే ఇక్కడ చాలా రైళ్లకు హాల్టింగ్ పాయింట్ లేదు. తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, షిర్డీ వంటి ముఖ్యమైన నగరాలకు వెళ్ళే రైళ్ళు కూడా ఇక్కడ ఆగవు. దీని వలన స్థానికులు దూర ప్రయాణాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్ వంటి స్టేషన్లకు వెళ్లి రైలు ఎక్కవలసి వస్తుంది. అయితే స్థానికులు రైల్వే అధికారులకు తమ గోడును చాలాసార్లు వెళ్లబోసుకున్నారు.

దీంతో సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు టెంపరరీ హాల్టింగ్ ఇచ్చారు. మూడు నెలపాటు ఈ హాల్టింగ్ పాయింట్ లో ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని లేకపోతే రద్దు చేస్తామని కండిషన్ పెట్టడంతో రైల్వే అధికారులు తాత్కాలికంగా ఇచ్చిన హాల్టింగ్ ను పర్మినెంట్ చేసుకోవడం కోసం స్థానికులు ప్రతిరోజు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో వాట్సాప్ గ్రూప్ ని పెట్టి అందులో సుమారు 400 మంది చేరి విరాళాల రూపంలో 25000 రూపాయలు సమకూర్చుకొని ఈ డబ్బుతో ప్రతిరోజు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. నెక్కొండ నుండి ఖమ్మం, సికింద్రాబాద్, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్ళినట్టు ట్రైన్ టికెట్లు కొంటున్నారు. తమ టెంపరరీ హాల్టింగ్ పాయింట్ ను పర్మినెంట్ చేసుకోవడానికి ఆ స్టేషన్ కి తమ టికెట్లు కొనుగోలు ద్వారా ఆదాయాన్ని చూపిస్తున్నారు.