Sunday, September 22, 2024
HomeUncategorizedఢిల్లీ నెలరోజుల పాటు 144 సెక్షన్‌

ఢిల్లీ నెలరోజుల పాటు 144 సెక్షన్‌

Date:

దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఆంక్షలను ప్రకటించారు. నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని వెల్లడించారు. అలాగే తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. లౌడ్‌ స్పీకర్ల వాడకంపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు.

‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేలమంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ ఆందోళనను ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్‌ నిర్వహించాయని.. అందులో పంజాబ్‌లో 30, హరియాణాలో 10 జరిగాయని తెలిపాయి. 2,000-2,500 ట్రాక్టర్లను మంగళవారం దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నాయి. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, కర్ణాటకల నుంచి కర్షకులు కార్లు, ద్విచక్రవాహనాలు, మెట్రో, రైళ్లు, బస్సుల ద్వారా కూడా దిల్లీకి చేరుకుంటారని తెలిపాయి. దాంతో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తవుతున్నారు.

పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ.. భారీగా బలగాలను మోహరిస్తున్నారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను నిలిపి ఉంచారు. అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పలుచోట్ల 144 సెక్షన్ విధించారు. ముగ్గురు కేంద్రమంత్రులతో కూడిన బృందం రైతు ప్రతినిధులతో రెండోసారి చర్చలు జరపనుంది. దానిలో భాగంగా పీయూశ్‌ గోయల్‌, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌.. చండీగఢ్‌లో వారితో చర్చించనున్నారు. ఫిబ్రవరి ఎనిమిదిన రెండు వర్గాల మధ్య ఒకసారి భేటీ జరిగింది. ఇదిలా ఉంటే.. మార్చ్‌ నిమిత్తం ఇప్పటికే పంజాబ్‌లోని పలు గ్రామాల నుంచి ట్రాక్టర్లు బయలుదేరాయి.