కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ముస్తఫాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ నిర్వహించాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈ ప్రచార సభ రద్దైందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాదిపూర్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని చెప్పారు. భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించే అవకాశం ఉందని అన్నారు.
సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరుకాలేదు. ఆయన పాల్గోవాల్సిన మూడు ప్రచార సభల్లో రెండు రద్దయ్యాయి. దీంతో ముస్లిం ఓటర్ల విభజనకు కారణం కాకుండా రాహుల్ గాంధీ ఆప్‌కు సహకరిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ దీనిని ఖండించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగానే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. రిపబ్లిక్ డే తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఇతర పార్టీ నేతలు ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని చెప్పారు.