ఛత్తీస్‌గఢ్ గరియాబంద్‌లో జరిగిన ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని కుల్హాది ఘాట్‌లోని అటవీ ప్రాంతాన్ని వెయ్యి మందికిపైగా భద్రతా బలగాలు అన్ని వైపులా చుట్టుముట్టాయి. అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు అక్కడ దాక్కుట్లు సమాచారం మేరకు బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. ఎన్కౌంటర్లో ఓ జవాన్‌ను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను విమానంలో రాయ్‌పూర్‌కు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్‌పూర్ జోన్ ఐడీ అమ్రేష్ మిశ్రా తెలిపారు.
సంఘటనా స్థలంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ తదితర ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందన్నారు. మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుల్హాది ఘాట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోందని.. ఇందులో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందిందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మార్చి 2026 నాటికి దేశం, రాష్ట్రంలో నక్సలైట్స్‌ను అంతం చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పం మేరకు భద్రతా బలగాలు ఈ విషయంలో నిరంతరం విజయం సాధిస్తూ లక్ష్యం వైపు వేగంగా కదులుతున్నాయన్నారు. ఈ సందర్భంగా బలగాలకు ప్రశంసించిన ఆయన.. ధైర్య సాహసాలకు వందనం చేస్తున్నానన్నారు.