Wednesday, January 22, 2025
Homeజాతీయంశ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం మూసివేత

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం మూసివేత

Date:

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రెండు నెలల పాటు జరిగే మండల-మకర విళక్కు వార్షిక పూజల కోసం నవంబర్‌ 15న అయ్యప్ప ఆలయాన్ని పూజారులు తెరిచారు. మండల పూజ అనంతరం డిసెంబర్‌ 26న గుడిని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. నాలుగు రోజుల విరామం తర్వాత డిసెంబర్‌ 30న సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరిచారు.

ఈ సీజన్‌లో అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. రోజుకు లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. మొత్తం 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు టీడీపీ తెలిపింది. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి, తూర్పు మండపంలో గణపతి హోమం చేశామని. ఆ తర్వాత మేల్శాంతి అరుణ్ కుమార్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతాభిషేకం నిర్వహించి, దానిని రుద్రాక్షలతో అలంకరించారని వెల్లడించారు. ‘హరివరాసనం’ పారాయణం తర్వాత మేల్శాంతి ఆలయ దీపాలను ఆర్పి గర్భగుడిని అధికారికంగా మూసివేశామని చెప్పారు. అనంతరం ఆలయ తాళాలను రాజకుటుంబ సభ్యుడికి అప్పగించామని తెలిపారు.