Wednesday, January 22, 2025
Homeక్రైంప్రియుడికి విష‌మిచ్చి చంపిన మ‌హిళ‌కు ఉరిశిక్ష‌

ప్రియుడికి విష‌మిచ్చి చంపిన మ‌హిళ‌కు ఉరిశిక్ష‌

Date:

ప్రియుడికి విషం ఇచ్చి చంపిన‌ మహిళకు కోర్టు మరణశిక్ష విధించింది. కేరళకు చెందిన 23 ఏళ్ల షారన్ రాజ్, తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల గ్రీష్మ ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమించుకున్నారు. అయితే గ్రీష్మకు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో ప్రేమ సంబంధాన్ని వదులుకోమని రాజ్‌కు చెప్పింది. అతడు ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించింది. తొలుత జ్యూస్‌లో పారాసిటమాల్ మాత్రలు కలిపి రాజ్‌కు ఇచ్చింది. అయితే చేదుగా ఉండటంతో తాగేందుకు అతడు నిరాకరించాడు.

2022 అక్టోబరు 14న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా రామవర్మంచిరైలోని తన ఇంటికి ప్రియుడు రాజ్‌ను గ్రీష్మ రప్పించింది. ఆయుర్వేద టానిక్‌లో విషం కలిపి ఇచ్చింది. అది తాగిన రాజ్‌ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. పలు అవయవాలు దెబ్బతినడంతో 11 రోజుల తర్వాత అక్టోబర్‌ 25న మరణించాడు. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది. మరోవైపు రాజ్‌ను హత్య చేసిన గ్రీష్మ, సహకరించిన ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండేళ్లుగా ఈ కేసుపై విచారణ కోర్టులో కొనసాగింది. జనవరి 17న తిరువనంతపురంలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గ్రీష్మను దోషిగా నిర్ధారించింది. సోమవారం శిక్షలు ఖరారు చేసింది. గ్రీష్మకు మరణశిక్ష విధించింది. ఆమెకు సహకరించి, ఆధారాలు ధ్వంసం చేసిన మేనమామ నిర్మల్‌ కుమార్‌కు మూడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది.