కేరళ రాష్ట్రంలో మైనర్ అయిన ఓ క్రీడాకారిణిపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 మంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గడిచిన ఐదేళ్లల్లో తనపై 60 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 18 ఏళ్ల ఆ క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మైనర్‌గా ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ సమాఖ్య నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్‌లో క్రీడాకారిణి తనకు జరిగిన దారుణాల గురించి వివరించింది. 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ తర్వాత కోచ్‌లు, క్లాస్మేట్స్, అథ్లెట్స్ఎక్కువగా లైంగికంగా వేధించారని వెల్లడించింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు 62 మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలిని కౌన్సిలింగ్‌కు పంపించినట్లు పథనంథిట్ట ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.