కరడుగట్టిన ఉగ్రవాదులను ఉంచిన జైలు వద్ద డ్రోన్ ల్యాండ్ అయ్యింది. కెమెరాలున్న దీనిని 8 రోజుల తర్వాత భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ జైలులోని భద్రతా ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడి కేంద్ర కారాగారంలో కరుడు గట్టిన 69 మంది ఉగ్రవాదులను ఉంచిన ప్రత్యేక సెల్ బీ బ్లాక్ సమీపంలో ఒక డ్రోన్ పడి ఉంది. జనవరి 8న భద్రతా సిబ్బంది దీనిని గుర్తించారు. కెమెరాలున్న చైనా తయారీ డ్రోన్ భోపాల్ జైలు వద్ద కనిపించడం కలకలం రేపింది. డిసెంబర్ 31న అది అక్కడ ల్యాండ్ అయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా భద్రతా సిబ్బంది తెలుసుకున్నారు. గత ఎనిమిది రోజులుగా జైలు ప్రాంగణంలో ఆ డ్రోన్ ఉన్నప్పటికీ ఎవరూ గమనించలేదు. ఈ నేపథ్యంలో ఆ జైలులో భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఆ డ్రోన్ యజమాని స్థానిక డాక్టర్ స్వప్నిల్ జైన్‌గా పోలీస్ అధికారులు గుర్తించారు. అతడి కుమారుడి కోసం కొన్న ఆ డ్రోన్ డిసెంబర్ 31న నియంత్రణ కోల్పోయి జైలు సమీపంలో పడినట్లు తెలుసుకున్నారు. ఐఎస్వో సర్టిఫైడ్ భోపాల్ జైలులో జామర్లు, సీసీటీవీలు సహా బహుళ స్థాయి భద్రత ఉన్నప్పటికీ వారం రోజులకు పైగా ఆ డ్రోన్‌ను భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం ఆందోళన రేపింది. ఈ నేపథ్యంలో జైలు వద్ద భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జైలు, పరిసర ప్రాంతాలను ‘నో-ఫ్లై జోన్’గా పరిగణించాలని యోచిస్తున్నది.