వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతిషి.. సల్వార్ కమీజ్, శాలువా, రూ.500 మీ ఐదేళ్ల అవసరాలను తీర్చలేవని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు బీజేపీ ఇచ్చే వాటి కోసం ఆశపడొద్దని అతిషి సూచించారు. అర్వింద్ కేజ్రివాల్ ఆలోచనల నుంచి వచ్చిన ఉచిత కరెంట్, ఉచిత తాగునీరు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్‌లలో ఉచిత వైద్యం లాంటి మీ ఐదేళ్ల అవసరాలను తీర్చగలుగుతాయని చెప్పారు. ఢిల్లీలో పేదల కోసం పనిచేసే నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ ఒక్కరేనని అతిషి అన్నారు.
కాబట్టి పేదలు బీజేపీ నాయకులతో చాలా జాగ్రత్తగా ఉండాలని అతిషి చెప్పారు. ఎందుకంటే బీజేపీ నాయకులు అభివృద్ధి పేరుతో పేదల ఆవాసాలను ధ్వంసం చేస్తారని, పేదల ఓట్లను తొలగిస్తారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.