దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రలు 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యల్పం అని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉదయం 8:30 గంటల సమయంలో సఫ్ధర్‌జంగ్ వెదర్ స్టేషన్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఇది సాధారణం కంటే నాలుగు పాయింట్లు తక్కువ అని పేర్కొంది. దాదాపు గడిచిన 14 సంవత్సరాల్లో 5 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి అని ఐఎండీ తెలిపింది. 1987 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో అత్యల్పంగా 4.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక ఇన్ని రోజులూ తీవ్ర వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ వాసులు.. ఇప్పుడు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు. నిరాశ్రయులు నైట్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు.