బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయబోమని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఒక ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకున్నది. పొరుగు దేశంలోని మైనారిటీ హిందువులపై దాడులు, భారత దేశ జెండాను అవమానించడాన్ని తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొంది. మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రే ఆసుపత్రి అధికారి సుభ్రాంషు భక్త్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఈ రోజు నుంచి నిరవధిక సమయం వరకు బంగ్లాదేశ్ రోగులను చికిత్స కోసం చేర్చుకోబోమని మేం నోటిఫికేషన్ జారీ చేశాం. భారతదేశం పట్ల వారు చూపిన అవమానాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించిందని సుభ్రాంషు భక్త్ గుర్తు చేశారు. అయినప్పటికీ భారత్ వ్యతిరేక భావాన్ని వారు ప్రదర్శిస్తున్నారని, త్రివర్ణ పతాకాన్ని అవమానించారని విమర్శించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై అకృత్యాలకు నిరసనగా నగరంలోని ఇతర ఆసుపత్రులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని సుభ్రాంషు భక్త్ పిలుపునిచ్చారు. బంగ్లాదేశీయులకు చికిత్స చేయకూడదన్న తమ నిర్ణయానికి ఇతర ఆసుపత్రుల మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే ఇతర ఆసుపత్రులు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటాయని తాము ఆశిస్తున్నామని అన్నారు.