పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి మూడు రోజులైంది. మూడు రోజుల నుంచి ఉభయసభలను అమెరికాలో అదానీ సంస్థపై కేసుల అంశం కుదిపేస్తుంది. అదానీ సంస్థపై కేసుల గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో సభలు వాయిదాపడుతూ వస్తున్నాయి. గురువారం కూడా ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.
ఈ క్రమంలో పెద్దల సభను రేపటికి వాయిదా వేసే ముందు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఛాంబర్ కేవలం చర్చలకు వేదిక కాదని, అంతకంటే ఎక్కువని, సభ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలకు పూనుకోవద్దని ధన్కర్ మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంపై చర్చలు జరగాలని అన్నారు. పార్లమెంటరీ వివాదం ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు.