తెలంగాణలో జీవో నంబర్ 16ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తూ జీవో నంబర్ 16ను జారీ చేసింది. దీనిపై కొంత మంది హైకోర్టు ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. అందుకే జీవో నంబర్ 16 రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. రెగ్యులరైజేషన్ అయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ అయినట్లు తెలిసింది. వీరంతా హైకోర్టు తీర్పుతో భయపడుతున్నట్లు తెలుస్తోంది.
దీనిపై అధికారులను సంప్రదించగా.. హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తే కానీ అస్సలు విషయం ఏమిటో తెలియదని పేర్కొంటున్నారు. తీర్పును బట్టిం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేది ఆధారపడి ఉందని వివరించారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్16 ను కొట్టేయడంతో తమ సంతోషం ఆవిరి అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత పలు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఆ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ జీవో నంబర్ 16ను తీసుకొచ్చారు.