Thursday, November 21, 2024
Homeజాతీయంమ‌ణిపుర్ విష‌యంలో రాష్ట్ర‌ప‌తి జోక్యం చేసుకోవాలి

మ‌ణిపుర్ విష‌యంలో రాష్ట్ర‌ప‌తి జోక్యం చేసుకోవాలి

Date:

మ‌ణిపుర్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, వాటిని పునరుద్ధరించేందుకు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ఆయన రెండు పేజీల లేఖ రాశారు. మణిపుర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ప్రజల జీవితాలకు రక్షణ కల్పించేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మణిపుర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల కారణంగా ఇప్పటివరకు మహిళలు, చిన్నారులు సహా 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. లక్షలాది మంది రోడ్డున పడ్డారన్నారు. కేవలం రాష్ట్రపతి జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, మళ్లీ మణిపుర్‌ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించగలుగుతారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడంలో సీఎం బీరేన్‌ సింగ్‌ విఫలమయ్యారని పౌరహక్కుల నేత, మణిపుర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ.. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.