Monday, January 13, 2025
Homeఅంతర్జాతీయంగాజాలో ఆహార సామాగ్రి ట్ర‌క్కులు లూటీ

గాజాలో ఆహార సామాగ్రి ట్ర‌క్కులు లూటీ

Date:

గాజా ప్రజలకు అందిస్తున్న మానవతా సాయానికి తీవ్ర ఆటంకం కలిగింది. ఆహార సామగ్రిని తరలిస్తున్న ట్రక్కులను కొందరు దుండగులు హింసాత్మంగా లూటీ చేశారు. మొత్తం 109 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు తరలిస్తుండగా.. డ్రైవర్లపై తుపాకీ ఎక్కుపెట్టి 97 ట్రక్కుల్లోని సరకును కాజేశారని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఆరోపించింది. శనివారం జరిగిన ఈ దాడిలో సహాయ సిబ్బందికి గాయాలయ్యాయని, ట్రక్కులు దెబ్బతిన్నాయని వెల్లడించింది.

”శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయని మేం చాలాకాలంగా హెచ్చరిస్తున్నాం. కొద్దికాలంగా మా కాన్వాయ్‌లకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. ఇజ్రాయెల్ అధికారులు చట్టపరమైన బాధ్యతలను విస్మరిస్తున్నారు” అంటూ తీవ్రంగా స్పందించింది. తక్షణ చర్యలు చేపట్టకపోతే.. గాజాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. గాజాలో పనిచేస్తోన్న యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఒక సంచిపిండి కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ”గాజా (Gaza)లో పరిస్థితి భయంకరంగా ఉంది. క్షామం ముప్పు పొంచి ఉంది. సుమారు 10 లక్షల మంది ఆకలితో మరణించే ప్రమాదం ఉంది” అని ఇప్పటికే వరల్డ్ ఫుడ్‌ ప్రొగ్రామ్ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో సోమవారం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక్క కుటుంబానికి చెందిన వారే 17 మంది ఉండటం గమనార్హం.