తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో భారాస ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అలాగే ఉందన్నారు. అదే రకమైన అవినీతి, గాలి మాటలు విని ప్రజలు విసిగిపోతున్నారన్నారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేశారన్నారు. రేవంత్ ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
”రైతు భరోసా, రుణమాఫీ లేదు. పింఛన్లు పెంచుతామన్నారు.. ఒక్క రూపాయి పెంచలేదు, కొత్త పింఛన్లు ఇవ్వలేదు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. హామీలన్నీ ఆయన గాలికొదిలేశారు. పైగా మహారాష్ట్రలో నిర్వహిస్తున్న ప్రచారంలో తెలంగాణ సస్యశ్యామలం అయిందంటూ మాట్లాడుతున్నారు. ఇంతకంటే అబద్ధాలు ఉంటాయా? కాంగ్రెస్, భారాస తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భాజపా (BJP) నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని భాజపా పోలింగ్ బూత్ కమిటీల నియామకం చేపట్టాలి. మళ్లీ మండల స్థాయి వర్క్‌షాపులు ఉంటాయి. ఈ నెల 22న దిల్లీలో జరగనున్న పార్టీ సంస్థాగత సమావేశాల్లో మండల, జిల్లా ఎన్నికల తేదీలు వస్తాయి. తెలంగాణలో పనిచేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి భ్రష్టు పట్టించింది” అని కిషన్‌రెడ్డి విమర్శించారు.