2025 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ యూనివర్శిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ మరియు సర్వేలో భారతీయ విశ్వవిద్యాలయాలు మంచి పనితీరు కనబరిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి అత్యధిక ఉపాధి పొందగల గ్రాడ్యుయేట్లపై ఆయా కంపెనీల యజమానుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లు నిర్ణయించబడ్డాయి. టాప్ 250లో 10 భారతీయ విద్యాసంస్థలను చోటు దక్కించుకున్నాయి. గత సంవత్సరం 9 యూనివర్సిటీలతోపోలిస్తే ఇది కొంత మెరుగుపడింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ హవా స్వల్పంగా తగ్గినప్పటికీ 28వ ర్యాంక్‌తో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భారతీయ విశ్వవిద్యాలయంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంది. 2024లో 55వ స్థానం నుంచి 2025లో 47వ స్థానానికి చేరుకుంది. ఇది టాప్ 50లోని రెండవ భారతీయ విశ్వవిద్యాలయంగా నిలిచింది.
‘ఈ విజయం అంతర్జాతీయ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తోంది. తద్వారా ఆయా సంస్థలు తమ సాంకేతిక బృందంలో ఈ విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లకు చోటు కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని THE తెలిపింది. కాగా GEURS ప్రకారం కంపెనీలు పని అనుభవం పొందిన గ్రాడ్యుయేట్లను కోరుకుంటున్నారు. ఈ విషయంలో గ్రాడ్యుయేట్స్ నైపుణ్యాలతో పాటు డిజిటల్ మైండ్‌సెట్ వంటి ఇతర అంశాలు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి.
సర్వే ప్రకారం 45.9 శాతం మంది యజమానులు కొత్త సాంకేతికతలను నేర్చుకునే మరియు స్వీకరించే సామర్థ్యం కలిగిన వారికోసం ఎదురుచూస్తున్నారు. అయితే 45.1 శాతం మంది కమ్యూనికేషన్ మరియు టీమ్‌వర్క్ వంటి విలువైన సపోర్ట్ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. ఈ విషయంలో గతేడాది మాదిరిగానే ఆసియాలోని విశ్వవిద్యాలయాల ఉనికి పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 3 పెరిగి టాప్ 250లో ఆసియా సంస్థలు 52 ఉన్నాయి.