Friday, November 15, 2024
Homeతెలంగాణతెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి రాబందులా మారారు

తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి రాబందులా మారారు

Date:

తన పదవి ఐదేళ్లే అనే విష‌యాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని, కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి రాబందులా మారారని బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. లగచర్ల ఘటన నిందితులతో సంగారెడ్డి సెంట్రల్‌ జైలులో ములాఖత్‌ అనంతం ఆయన మాట్లాడారు. గతంలో రేవంత్‌రెడ్డి ఫార్మా కంపెనీలను విమర్శించారని చెప్పారు. ఇప్పుడు మాత్రం వేల ఎకరాలు కావాలంటున్నారని పేర్కొన్నారు. కులగణనలో పాల్గొన్న వ్యక్తిని కూడా అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. వేరే చోట ఐటీఐ చదువుకున్న విద్యార్థిని కూడా అరెస్టు చేశారన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా లగచర్లలో ఆందోళనలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కేవలం భారాస కార్యకర్తలనే అరెస్టు చేశారని ఆరోపించారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌ సర్కారు యత్నిస్తోందని మండిపడ్డారు. కావాలనే ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమారన్నారు.

”సీఎం అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఫోన్‌లో ఆదేశాలిస్తున్నారు.. అధికారులు పాటిస్తున్నారు. కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలన్నదే ఆయన యత్నం. ఇవాళ కొడంగల్‌ తిరగబడింది.. రేపు తెలంగాణ తిరగబడుతుంది. అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసు. కేసులెన్ని పెట్టినా భారాస కార్యకర్తలు భయపడొద్దు. ఎకరం రూ.60 లక్షల భూమిని రూ.10 లక్షలకు గుంజుకునే యత్నం జరుగుతోంది. పేదవాడి కన్నీళ్ల ఉసురు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగులుతుంది. రేవంత్‌రెడ్డి చేతనైతే మాతో కొట్లాడాలి.. అమాయకులతో కాదు” అని కేటీఆర్‌ చెప్పారు.