Friday, November 15, 2024
Homeఅంతర్జాతీయంప్ర‌పంచంలో అత్య‌ధిక‌ వాయుకాలుష్యం ఇక్క‌డే

ప్ర‌పంచంలో అత్య‌ధిక‌ వాయుకాలుష్యం ఇక్క‌డే

Date:

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ప్ర‌పంచంలోని అత్య‌ధిక వాయుకాలుష్య న‌గ‌రంగా పేరుగాంచింది. ఇక్కడ శుక్రవారం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) దాదాపు 1600గా తేలింది. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పాక్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా పొగ చూరింది. స్విస్‌ మానిటరింగ్‌ సంస్థ ‘ఐక్యూఎయిర్‌’ అంచనాల ప్రకారం లాహోర్‌లోని సీఈఆర్పీ ఆఫీస్‌ ప్రాంతంలో 1587గా తేలింది. ఈ నగరంలో ఈ ఆఫీస్‌తో పాటు సయ్యద్‌ మర్తిబ్‌ రోడ్‌, పాకిస్థాన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఆఫీస్‌, వీటీఎస్‌ వద్ద ఏక్యూఐ 1,000 దాటేసింది.

లాహోర్‌లోని సగటు ఏక్యూఐ గురువారం 1300గా నిలిచింది. దీంతో ఈ ఏడాది నవంబర్‌లో ప్రపంచంలోనే అత్యధిక వాయుకాలుష్యం నమోదైన నగరంగా నిలిచింది. లాహోర్‌ నగరం ఒక్కచోటే గత 24 గంటల్లో దాదాపు 15,000 మంది శ్వాస సంబంధ, వైరల్‌ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లారని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. ముల్తాన్‌ నగరంలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ రెండుచోట్ల కలిపి 70,000 మంది ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. ఎక్కడా కట్టడి కావడం లేదు. దీంతో ఇక్కడి స్కూళ్లను బలవంతంగా మూసివేయించాల్సిన పరిస్థితి తలెత్తింది. పార్కులు, మ్యూజియంలను వారాంతం వరకు తెరవకూడదని నిర్ణయించారు. మూడు నెలల పాటు పెళ్లి సంబరాలను నిషేధించారు. అక్కడి పంజాబ్‌ ప్రావిన్స్‌లో కూడా స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని నిర్ణయించారు.