Thursday, November 14, 2024
Homeజాతీయంస‌మాజాన్ని విభ‌జించేందుకు ప్ర‌తిప‌క్షాల కుట్ర‌

స‌మాజాన్ని విభ‌జించేందుకు ప్ర‌తిప‌క్షాల కుట్ర‌

Date:

స‌మాజాన్ని కులం, మ‌తం, భాష‌, లింగం పేరుతో విభ‌జించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ స్వామినారాయణ ఆలయం 200వ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని వడ్తాల్‌లో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. కులగణనను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలను దుయ్యబడుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజించాలని చూసే వారి ఆలోచనలను ప్రజలు గుర్తించి, తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. దేశ వ్యతిరేకులు పన్నే కుట్రలను దేశ ప్రజలంతా కలసికట్టుగా ఎదుర్కోవాలని మోడీ పిలుపునిచ్చారు.

షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనకబడిన తరగతులు అభివృద్ధి చెందడాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతుందని ప్రధాని మోడీ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్‌ నేతలు ఓబీసీలలోని కులాలను విభజించడానికి చూస్తున్నారని మండిపడ్డారు. దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి బలమైన, సమర్థులైన, విద్యావంతులైన యువతను తయారుచేయాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం కలిగిన యువతే దేశ భవిష్యత్తుకు అతిపెద్ద బలం అవుతుందన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోందని.. తాను ఏ దేశ నాయకులను కలిసినా భారత యువతలో ఉన్న ప్రతిభను పొగుడుతూ.. వారికి తమ దేశంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారని పేర్కొన్నారు. 2027లోపు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల వరుసలో నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఈ బాధ్యతను దేశ పౌరులు కూడా తీసుకోవాలని అన్నారు.