Thursday, November 14, 2024
Homeతెలంగాణతెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లా.. లేన‌ట్లా..

తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లా.. లేన‌ట్లా..

Date:

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందో, లేదో అర్థం కావ‌డం లేదని, తెలంగాణ మార్కెటింగ్ శాఖ అలసత్వం, సమన్వయలోపం వల్ల పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం తేమశాతం సహా ఇతర నిబంధనల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితికి రాష్ట్ర రైతాంగాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని మండిపడ్డారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి నష్టపోయిన పత్తి రైతులపై ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎక్స్‌ వేదికగా విమర్శించారు.

సీసీఐ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోళ్లు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్, మిల్లుల యాజమాన్యాలు సమ్మె ప్రకటిస్తే సమస్యకు పరిష్కారం చూపే కనీస ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు అని హరీశ్‌రావు అన్నారు. పత్తి రైతులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా?.. లేనట్లా? అని ప్రశ్నించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు ఫొటోలకు ఫోజులిచ్చిన మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. పంట చేతికి వచ్చిన ఈ సమయంలో రైతుల జీవితాలతో చెలగాటమాడటమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిల్లుల వద్దకు చేరిన పత్తి లారీల లోడ్లతో రైతులు ఎన్ని రోజులు ఎదురుచూడాలని హరీశ్‌రావు నిలదీశారు. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి వెళ్లే సీఎం, మంత్రులకు రైతుల సమస్యలను పట్టించుకొనే సమయం లేదా అని ప్రశ్నించారు.